"ఏంటి కోవిద్ అది?"
"దా దా .. "
నోటికి దగ్గరగా తీసుకున్నాడు ...
"ఓయ్ ఏం చేస్తున్నావ్?"
"వూ ... "
నోట్లో పెట్టుకున్నాడు.
"ఒరేయ్ అతి నా కొడకా !!"
తన నోట్లో నా వేలు పెట్టి ఆ చెత్తఏమిటో తీయాలి అనుకున్నా, నన్ను తోసేసాడు.
ఇంతలో...
ఓ సొట్ట మూతి..
కళ్ళలో ఓ రెండు కన్నీటి ముత్యాలు..
రెండు పసిపాదాలు పుడమిని క్రిందకు తోసాయి..
లేలేత తాటి నుంజులు, ఆ బుగ్గలు, గజ గజ వోణికాయి..
కొత్తగా వచ్చిన పాల పళ్ళను గట్టిగా కొరికాడు...
లేతపిడికిళ్లు బిగుసుకోనాయి..
ఓ చిరు తుఫాను బలపడింది..
రెప్పపాటులో నా చుపుడు వేలును తీసుకొని, కోరికేశాడు, కాస్త రక్తం వచ్చింది.
ఆ రోజు నాకు అర్థమైంది, కొడుక్కు కోపం వస్తుంది. రోజంతా ఆలోచన.
తనకు నచ్చనిది చేయనివ్వక పోతే కొడుక్కి, నాన్న మీద కోపం వస్తుంది, చాలా ఎక్కువగా వస్తుంది. అది తన మంచి కొసమె అని తెలుసుకోవడానికి ఒక తరం పడుతుంది. మా నాన్న మీద నాకు గౌరవం వచ్చిన రోజులకన్నా, కోపం వచ్చిన రోజులే చాలా ఎక్కువ. నన్ను కొట్టిన ప్రతిసారి కోపంతో ఊగిపోయివాడిని. క్రికెట్ ఆడుకోనివ్వడు , అప్పుచేయనివ్వడు, చదువుకోమంటాడు, టీవీ, ఫోన్ వొదంటాడు ఇలా ఎన్నో గుర్తుకు వచ్చి ఆ రాత్రి, నా చేయి కోవిద్ కి దగ్గరగా పెట్టుకొని, నిద్ర పోయా...
- వంశీ